Monday, January 16, 2012

జూదాల జోరు.. పందాల హోరు * కోట్లు హుష్‌కాకి!

 
*  కోడి పందాలు.. పక్కనే జూద శిబిరాలు
*  పందాల్లో చేతులు మారింది రూ.150 కోట్లు!
*  జూదంలో మరో రూ.100 కోట్లు హాంఫట్!
*  డెల్టాను తలదన్నుతూ మెట్టలోనూ పందాలు
*  ఏరులై పారిన మద్యం.. పలుచోట్ల ఘర్షణలు
*  పందాలరాయుళ్ల ఇళ్లు.. ఒళ్లు గుల్ల!

సంప్రదాయం ముసుగులో జూదం వెర్రితలలేసింది. పండుగ మూడు రోజులూ పందాలరాయుళ్లు కోడి పందాలు, జూదాలతో ఊగిపోయూరు. కోడి పందాల్లోనే కాదు.. కోతాట, గుండాట, మూడు ముక్కలాట, గ్లాస్ బాల్ ఆట, స్ట్రయికర్ (బిళ్లాట), బ్రాకెట్ అంటూ రకరకాల పేర్లతో సాగిన జూదంలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. 


‘రాజకీయ పెద్దలు.. బడాబాబులు’ సాగించిన జూదక్రీడలో పందెగాళ్లు రూ.150 కోట్లు ఫణంగా పెట్టగా, దానిలో దాదాపు పది కోట్లు నిర్వాహకుల జేబుల్లోకి చేరాయి. రాజధాని నుంచి ఆదేశాలు, జూదాల నిర్వాహకులతో కుదిరిన బేరాలతో మూడు రోజులు నిద్ర నటించిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు జూలు విదుల్చుతానంటోంది. మంగ ళవారం నుంచి కోడిపందాలు, పేకాట శిబిరాలపై ఝుళిపించేందుకు లాఠీలను సిద్ధం చేస్తోంది.

పందెం కోడి ప్రతాపం చూపింది. నిమిషాల వ్యవధిలో పందెగాళ్ల తలరాతల్ని మార్చేసింది. కార్లలో సంచులతో డబ్బు తెచ్చిన జూదరులకు ఖాళీ చేతులు మిగిల్చింది. లక్షలు ‘పెట్టుబడి’ పెట్టిన నిర్వాహకుల్ని కోటీశ్వరుల్ని చేసింది. ఈ ఏడాది సంక్రాంతి పందాల్లో విశేషమేమిటంటే.. పందాల నిర్వహణకు పేరుమోసిన డెల్టా ప్రాంతానికి దీటుగా మెట్ట ప్రాంతంలోనూ కోట్లాది రూపాయల్లో పందాలు సాగాయి. జిల్లా మొత్తం మీద ఏర్పాటైన దాదాపు 300 కోడి పందాల శిబిరాల్లో రూ.150 కోట్లు చేతులు మారగా, ఒక్క జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే రూ.50 కోట్ల సొమ్మును ఫణంగా పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఈ శిబిరాలకు అనుబంధంగా నిర్వహించిన పేకాట కోసుల్లో మరో రూ.వంద కోట్లు వరకు చేతులు మారినట్లు అంచనా.

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో వేసిన పందాల్లో పొరుగున ఉన్న ఖమ్మం, కృష్ణా జిల్లాల నుంచి వేలాది మంది జూదరులు పాల్గొన్నారు. కామవరపుకోట మం డలం కళ్లచెరువులో పందాలకు టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు గోపాలరావు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ హాజరయ్యారు. గెలిచిన పుంజుల యజమానులకు ఎమ్మెల్యే రాజేష్ బహుమతులు అందజేశారు. పోడూరు, కొప్పాక, ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్ర మం, వెంప, కలగంపాడు, కొణిజర్ల, ఆకివీడు, కాళ్లుకూరు, ఉండి, యండగండి, మహాదేవపట్నం, మోగల్లు, విస్సాకోడేరు, పెన్నాడ, చాగల్లు, చిక్కాల, నిడదవోలు, తాడేపల్లిగూడెం, సీతంపేట, గూటాల, దేవరపల్లి, చిన్నాయగూడెం, గౌరీపట్నం, అప్పనవీడు, కొమ్మర, అత్తిలి, వేల్పూరు, ఇరగవరం, రేలంగి, ఇల్లింద్రపర్రు, బుట్టాయగూడెం, వెంకటాపురం, రావికంపాడు, కొయ్యలగూడెం, బయ్యన్నగూడెం, రాజ వరం, సీతంపేట, దిప్పకాయలపాడు, తిరుమలదేవిపేట, టి.నర్సాపురం, రాచన్నగూడెం, టి.గంగన్నగూడెం, చంద్రమ్మకాలనీ, కొవూరుపాడు, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, పెదవేగి, కొండలరావుపాలెం, కవ్వగుంట తదితర ప్రాంతాల్లో జరిగిన భారీ పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. 

కొవ్వూరు మండలం వాడపల్లి, సీతంపేట, ఐ.పంగిడి గ్రామాల్లోని శిబిరాలు పందాలరాయుళ్లతో కిక్కిరిశాయి. కొప్పాక, పోడూరు ప్రాంతాల్లో ఒక్కో పందానికి రూ.లక్షకు పైగా ఉంటేనే బరిలో ఉండాలనే నిబంధన విధించారు. ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్రమం, వెంప గ్రామాల్లో సాగిన పందాల్లో ఒక్కో పందానికి రూ.25 వేలకు తక్కువ కాకుండా ఉండాలని షరతు విధించారు. భారీ మొత్తాలతో కొందరు కోళ్లను బరిలో దించితే మరికొందరు వేలాది రూపాయలు పైపందాలు కాశారు.
రకరకాల జూదం


సంప్రదాయం పేరుతో కోడి పందాలకు లోపాయికారీ అనుమతి తీసుకున్న నిర్వాహకులు జూద శిబిరాలను ఏర్పాటుచేసి పందెగాళ్ల జేబుల్ని ఖాళీ చేశారు. మూడు ముక్కలాట, గుండాట, బ్రాకెట్, స్ట్రయికర్ (బిళ్లాట), కోతాట అన్ని శిబిరాల్లో యథేచ్ఛగా కొనసాగాయి. కోడి పందాల్లో కంటే వీటిలో పోగొట్టుకున్న సొమ్మే ఎక్కువ. జిల్లావ్యాప్తంగా అన్ని శిబిరాల్లోనూ మందు, విందుతో పసందైన ఏర్పాట్లు చేయడంతో జూదరులు పండగ పూట ఇంటి ముఖం చూడలేదు. పందాల పౌరుషానికి మద్యం మత్తు తోడవడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఇరగవరం మండలం సూరంపూడిలో కోడిపందాల శిబిరం వద్ద ఆదివారం రాత్రి జరిగిన కోట్లాటలో ఏడుగురికి గాయాలయ్యాయి. మిగిలిన చోట్ల కూడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కాగా, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, బడాబాబుల దబాయింపులతో పోలీసులు పందాలు, జూదాలవైపు చూసే సాహసం చేయలేదు. జనం పెద్ద ఎత్తున చట్టాన్ని ఉల్లంఘించడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు గప్‌చిప్‌గా ఉండిపోయారు.
నిర్వాహకులకు ‘కేవుల్’ కాసులు
సంక్రాంతి పందాలు శిబిరాల నిర్వాహకులకు భారీ ఆదాయాన్ని ఆర్జించి పెట్టాయి. కోడి పందాల్లో లక్షకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కేవులు తీస్తారు. దీన్ని నిర్వహణ ఖర్చులుగా చెబుతారు. గతంలో అనేక చోట్ల కేవుల్ సొమ్ములు నిర్వాహకుల మధ్య వివాదాలకు కారణమయ్యా యి. డెల్టాలోని కొన్నిచోట్ల నిర్వాహకుల తీరుపై గుర్రుగా ఉన్న కీలకమైన పందెగాళ్లు ఈసారి మెట్టప్రాంతంలోని కొప్పాక, శ్రీనివాసపురం, కొణిజర్లలాంటి చోట జరిగిన పెద్ద పందాలకు తరలివెళ్లిపోయారు. డెల్టాలో కన్నా మెట్ట ప్రాంతంలోనే భారీ మొత్తాలు చేతులు మారినట్లు చెబుతున్నారు.


కృష్ణా జిల్లాలో కోట్లు హరీ!
 
సంక్రాంతి పండగ మూడు రోజులూ.. పల్లెలన్నీ కోడి పందేలతో హోరెత్తాయి. జనం మద్యం మత్తులో తూగి ఊగారు. కూలీ నుంచి కోటీశ్వరుడు వరకూ కోడిపుంజుల పౌరుషాగ్నిలో చలికాచుకున్నారు. పై పందేలు వేసి అనేకమంది జేబులు ఖాళీ చేసుకున్నారు. ఈ మొత్తం రూ.50 కోట్లకు పైగానే ఉంటాయని లెక్కిస్తున్నారు. పశ్చిమ కృష్ణాతో పోల్చితే తూర్పులో ఈ జోరు ఎక్కువగా కనిపిం చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పందేలకు తమ పూర్తి మద్దతు ఇవ్వడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
 సంక్రాంతి సంబరాల్లో కోడి పందేల వెర్రి హోరెత్తింది. మూడురోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా పందేలు, జూదం కొనసాగాయి. వీటిలో రూ.50 కోట్లకు పైనే చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. తూర్పు కృష్ణా మొత్తం పందేల జోరులో ఊగిపోయింది. కూలీనాలీ చేసుకునే సామాన్యులు మొదలు ధనవంతులు, రాజకీయ నాయకులు వరకూ అంతా శని, ఆది, సోమవారాల్లో ‘బరి’ బాట పట్టారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకూ పందేలు కాశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో గతంలో ఆ ఊసే లేని గ్రామాలు కూడా పండగ రోజున రంగంలోకి దిగాయి.
మొవ్వ మండలం భట్లపెనుమర్రు, గూడూరు మండలం గూడూరు, మండవల్లి మండలం చింతపాడు, కైకలూరు మండలం భుజబలపట్నం, హనుమాన్‌జంక్షన్ సమీపంలోని తాళ్లమూడి (పశ్చిమగోదావరి పరిధి), చాట్రాయి మండలం జనార్దనవరం, ఘంటసాల మండలం పాపవినాశనం, మోపిదేవి మండలం బొబ్బర్లంక, పమిడిముక్కల మండలం మేడూరులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. భట్లపెనుమర్రు, గూడూరు, తాళ్లమూడి, జనార్దనవరంలో జరిగిన పందేల్లోనే రూ. 15కోట్లు చేతులు మారినట్లు చెబుతున్నారు. తూర్పు కృష్ణాలోని గుడివాడ, గుడ్లవల్లేరు, పామర్రు, కలిదిండి, పెడన, అవనిగడ్డ ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో పందేలు జరిగాయి. తూర్పుకృష్ణా స్థాయిలో కాకపోయినా నూజివీడు డివి జన్‌లోనూ పందేలు బాగానే జరి గాయి. నందిగామ, జగ్గయ్యపేట ప్రాం తాలు ఇందుకు మినహాయింపుగా నిలిచాయి.
ట్రాక్టర్లు, ఆటోల్లో..
పందేల్లో పాల్గొనడానికి పెద్దపెద్ద బరుల వద్దకు గ్రామాల నుంచి జనం ఆటోలు, ట్రాక్టర్లు, కార్లలో వెళ్లారు. పందేలు జరిగే చోట మద్యం అమ్మకాలు కూడా యథేచ్ఛగా సాగాయి. కొన్ని చోట్ల కోసులు నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు కూడా పందేల్లో పాల్గొనడం, స్థానిక ప్రజాప్రతినిధులు అండదండలందించడంతో అడ్డుకునేవారే లేకుండా పోయారు.

మిన్నకుండిపోయిన పోలీసులు
జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపానపోలేదు. పైస్థాయి నుంచే వారిపై ఒత్తిడి ఉండడం, ఎమ్మెల్యేలు ముందస్తుగానే వారికి హైదరాబాద్ నుంచి ఫోన్లు చేయించడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా నోరు మెదపలేదు. పోలీసులు పట్టించుకోవడంలేదనే సమాచారం జిల్లా అంతా గుప్పుమనడంతో పందేలు వేసే ఆలోచన లేని గ్రామాలు కూడా అప్పటికప్పుడు బరిలు ఏర్పాటు చేసి పందేలు వేయడం గమనార్హం.

కమిషనరేట్‌లోనూ..
జిల్లాలో విచ్చలవిడిగా కోడి పందేలు జరిగినా కమిషనరేట్ పరిధిలో మాత్రం చాలా వరకూ ఆ హడావుడిని తగ్గించగలిగారు. అయితే జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పమిడిముక్కల మం డలం మేడూరులో భారీ స్థాయిలోనే కోడిపందేలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో ఎక్కడా కోడి పందేలకు ససేమిరా అన్న పోలీసులు ఆయన ఒత్తిడితోనే మేడూరుకు మాత్రం అనధికారికంగా అనుమతిచ్చినట్లు తెలిసింది. మర్రివాడలోనూ పందేలు జరిగాయి. అక్కడకు వెళ్లిన పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గ్రామస్తులు వినే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు వెనక్కి తిరిగి వచ్చేయక తప్పలేదు. కోడి పందేలను పూర్తిగా వదిలేసి అక్కడక్కడా దాడులు చేసి చేతులు దులుపు కున్నారు.

No comments:

Post a Comment