Saturday, January 14, 2012

కో ‘ఢీ’ * కాలు దువ్వి ... కత్తి దూసి.... సై..!

 http://www.eenadu.net/district/weg-panel1a.jpg
సంక్రాంతి అనగానే రాష్ర్టంలో అందరి చూపూ ఉభయ గోదావరి జిల్లాలపైనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. పండుగను పురస్కరించుకొని ఈ రెండు జిల్లాలోనూ భారీఎత్తున కోళ్ళ పందాలు జరుగుతాయి. వీటిని తిలకించేందుకు రాష్ట్రం నుంచే గాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు సైతం హాజరవుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పందేలపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నా, మరికొన్ని చోట్ల మాత్రం వీటిని కాస్తంత చూసీ చూడనట్లుగానే వదిలేస్తున్నారు. ఈ పందేలు జంతుహింసను, బెట్టింగ్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయని కొంతమంది వాదిస్తున్నారు. జంతుహింసకు తావు లేని రీతిలో ఈ పందేల నిర్వహణలో మార్పు తేవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ వాదవివాదాలు ఎలా ఉన్నా ...ఈ సంక్రాంతికి కోళ్ళపందేలు మాత్రం ఒక ఆనవాయితీగా నిల్చిపోయాయి. 
కోళ్లు కాలు దువ్వుతున్నాయి.. బరులు సిద్ధమయ్యాయి.. పందాల రాయుళ్లు రెడీ అయ్యారు.. సంక్రాంతి మూడు రోజులూ పందాల జాతరే.. జూదాల మోతే..


పోలీసుల అనుమతితో సంబంధం లేకుండా రాజకీయ నేతల వత్తాసుతో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఏమైనా సరే కోడి పందాలను అనుమతించమంటూ బెట్టు చేసే పోలీసులు చివరికి ఆ మూడు రోజులూ చేతులెత్తేసి పత్తా లేకుండా పోవడం పరిపాటైంది. ఈసారి కూడా అదే జరుగుతుందనే ధీమాతో పందాల నిర్వాహకులు మున్నెన్నడూ లేనంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతా ల్లో మాత్రమే కోడి పందాలు నిర్వహించేవారు. కాని ఈసారి పట్టణాల నడిబొడ్డున సైతం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందాల రాయుళ్లు ‘పశ్చిమ’కు తరలివస్తున్నారు.
 
సంక్రాంతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పండుగ. ఈ పండుగ మూడు రోజులు కత్తులతో ఎగిరే కోడి పుంజులు గోదావరి జిల్లాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. పలు చోట్ల అయితే సంక్రాంతికి నాలుగు రోజుల ముందే ఈ కోడి పందాలు మొదలయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పేరుమోసిన పందెం రాయుళ్ళు ఇప్పటికే గోదావరి జిల్లాల్లోని భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, ఐ.భీమవరం, కవిటం, కోడూరు, లంకల కోడేరు, రాజమండ్రి, తుని, రాజానగరం, రంగంపేట పెద్దాపురం, కాకినాడ, గోకవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లోని హోటళ్ళు, లాడ్జిలలో మకాం వేశారు. 



కొందరైతే స్థానికంగా వున్న కోడిపుంజుల పెంపకందార్ల ఆచూకీని తెలుసుకుని ఆయా కోడిపుంజుల రకాలను బట్టి ఒక్కొక్క పుంజును రూ.5 వేలు నుంచి రూ.10వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిపై పందేలు మాత్రం భారీస్థాయి లోనే ఉంటాయి. ఈ పందేను తిలకించేందుకు సినీ ప్రము ఖులు, రాజకీయ నాయకులు సైతం ఈ మూడు రోజులు గోదావరి జిల్లాలకు తరలిరావడం ఆనవాయితీగానే మారిపోయింది.

పోలీసులు నై అనడం.. పొలిటికల్ నేతలు సై అనడం.. ప్రతి ఏటా జిల్లాలో కోడి పందాలపై సాగుతున్న తంతే. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పందాల నిర్వాహకులు ముందు నుంచే ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం కొన్ని ప్రధాన ప్రాంతాల్లోనే పోలీసులు అనుమతితో పెద్ద ఎత్తున సాగిన ఈ జూద క్రీడ రాన్రానూ ఊరూవాడా పాకింది. జిల్లాలోని పలు ప్రధాన కేంద్రాల్లో శుక్రవారం కోడిపందాల బరి ఏర్పాట్లు చకచకా సాగాయి. శనివారం ఉదయం 10 గంటలకు పోలీసుల నుంచి అనుమతి వస్తుందన్న ధీమాతో ఏర్పాట్లు చేసుకుంటున్నామని నిర్వాహకులు బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయ నేతల ఒత్తిళ్లతో గత రెండ్రోజులుగా పోలీసులు కాస్త మెత్తబడ్డారు. ఏటా మాదిరిగానే సంక్రాంతి మూడ్రోజులు పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారని, ఇక తమకు అడ్డు ఉండదని పందాల నిర్వాహకులు ధీమాగా చెబుతున్నారు.

జిల్లాలో సుమారు 10కిపైగా ప్రాంతాల్లో భారీ పందాలు, 250 ప్రాంతాల్లో ఒక మోస్తరు పందాలు సాగుతాయన్నది అంచనా. ఈ మూడ్రోజుల పందాల్లో గత ఏడాది సుమారు రూ.100 కోట్లకుపైగా పందాల రూపంలో చేతులు మారినట్లు అంచనా. ఈ సారి నిర్వాహకులు సంప్రదాయాన్ని కొనసాగించకపోతే స్థానికంగా జూదాల రాయుళ్ల వద్ద పరువు పోతుందనే పంతానికి పోయి ఏదోలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక పరిస్థితులను కాదని పందాలకు సహకరించకపోతే వాటిని నిర్వహించే కీలక వ్యక్తుల నుంచి ఎన్నికల్లో ముప్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులు సైతం అందుకు సై.. అంటున్నారు. కీలక ప్రజాప్రతినిధులు సైతం ఆ మూడ్రోజులు చూసీ చూడనట్లు పోండని పోలీసులకు హితోపదేశాలు చేస్తున్నారు. జిల్లాలో అయిభీమవరం, పోడూరు మండలం, యలమంచిలి మండలం, పాలకొల్లు మండలం, చింతలపూడి మం డలం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో భారీస్థాయి కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పలు మండలాల్లోని గ్రామగ్రామాన చిన్నస్థాయి కూర పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.




కోడి పుంజల రంగులతో పందాలు 

 
 
 

పందాలు ఎన్ని కోట్ల మేర నిర్వహించినప్పటికీ పుంజుల రంగుల బట్టి పందాలు నిర్వహించడం విశేషం. ఈమేరకు ఇప్పటికే కుక్కుటశాస్త్రానికి అనుకూలంగా పందెం కోళ్లను తయారు చేస్తున్నారు. డేగ, నల్లకాకి, కాకి, నెమలి, నల్లబొట్ల సీతువా, పర్లా, కక్కిరా, రసంగి వంటి పేర్ల గల కోళ్లను బిరిల్లో దింపేందుకు సిద్ధం చేశారు. 

 


కత్తి కట్టేవారికి భారీ డిమాండ్‌! 

పందెం కోళ్ళకు కత్తి కట్టడం ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని కుటుంబాలకు ఆచారంగా వస్తుంది. వీరు పుంజులకు కట్టే కత్తులపైన ప్రత్యేక శ్రద్ధ వహించి బరిలోకి దిగే పుంజుల కాళ్ళకు ఒకరీతిన కత్తి కడతారు. పోటీదారుల ఇద్దరిని నొప్పించకుండా కత్తులు కట్టినట్టు వ్యవహరిస్తారు. కానీ ఈ కత్తి కట్టు ఆధారంగానే గెలుపు కీలకం కావడం వీరి ప్రత్యే కత. అందుకే సెంటుమెంట్‌గా ఆయా కుటుంబాల సభ్యుల తోనే భారీ పందెం రాయుళ్ళు తమ పుంజులకు కత్తులు కట్టిస్తారు. వీరికి ఇచ్చే పారితోషికం కూడా భారీగా వుంటుంది. ఈ కోడిపందెంల్లో కత్తులతో పోటీపడే వాటిపైనే భారీ మొత్తంలో పందెలు కాస్తుంటారు. పలుచోట్ల కత్తికట్టేవారికి కూడా పందెంలో వాటా చెల్లించడం కూడా వుంటుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, గణపవరం, తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో కత్తులను తయారు చేస్తుంటారు. 

ఇతర ప్రాంతాల నుంచి కోచ్‌ల రాక

Bull-riding 

క్రికెట్‌ వంటి క్రీడాకారులకే ప్రత్యేక శిక్షణ ఇచ్చే కోచ్‌లనే మనం చూస్తుంటాం. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలకు కూడా ఇటీవల ప్రత్యేక శిక్షణ ఇచ్చే కోచ్‌లు కూడా తయారయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోడిపుంజులను వారి పర్యవేక్షణలో ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్నారు. ఈ శిక్షణ ఇచ్చేందుకు మన రాష్ర్టంలోని విజయనగరం, బొబ్బిలి వంటి ప్రాంతాల నుంచే కాకుండా ఒరిస్సా, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా కోచ్‌లను భారీ పందెం రాయుళ్ళు రప్పించుకున్నట్టు తెలిసింది. వీరంతా దాదాపు 15 రోజుల ముందే స్థానిక లాడ్జిలు, హోటళ్ళలో దిగినట్టు తెలిసింది. వీరు పందెంకు ఎంపిక చేసిన పుంజులను తమ ఆధీనంలోకి తీసుకుని నీటిలో ఈత కొట్టించడం, ఆవిరి పట్టడం, రెండు పూటల వ్యాయామం చేయించడం ఈ కోచ్‌ల ప్రత్యేకత. వీటికి ఆహారంగా జీడిపప్పు, గుగ్గుళ్ళు, చోళ్ళు, మేక మాంసం, తొండ మాంసం వంటివి తినిపిస్తుంటారు. 

cock-fight
పరువు కోసం పోరు..

ప్రతి ఏటా కోడిపందాల రూపంలో పోలీసులు పరువు పోతూనే ఉంది. చివరి నిమిషం వరకు యజమాని పంతం నెగ్గించేందుకు పందెం పుంజు పోరాడుతున్నట్లే ఉనికి కోసం జిల్లా పోలీసు యంత్రాంగం తాపత్రాయపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పందాల బరులు వద్ద పెద్ద ఎత్తున పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. గత రెండ్రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు కత్తుల కట్టేవారు, చిన్నాచితక పందాలు నిర్వహించిన వారిని పోలీసుస్టేషన్‌లకు తీసుకొచ్చి బైండోవర్ కేసులు నమోదు చేశారు. పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ఖాకీల సమక్షంలోనే బరులను సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు తలమునకలవ్వడం గమనార్హం.

కలకలం రేపిన అన్నపూర్ణమ్మ పేరుతో వచ్చిన లేఖ

జిల్లాలో నర్సాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువవుతున్నారు. రాజకీయంగా ఎమ్మెల్యేలు సైతం ఆయనపై ఆరోపణలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాపిరాజు సతీమణి అన్నపూర్ణమ్మ పేరుతో అపరిచితులు రాసిన లేఖ పెనుదుమారమే రేపింది. కోడిపందాలను అడ్డుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఆమె పేరుతో రాసిన లేఖ మీడియాకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొరియర్ ద్వారా పంపించడం తెలిసిందే. ఆ లేఖ తాను రాయలేదని అన్నపూర్ణమ్మ స్పష్టం చేయడంతో లేఖ ఎవరూ రాశారు అనేదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. కాగా, డీసీసీ అధ్యక్షుడు గోకరాజు రామరాజు స్వగ్రామం జువ్వలపాలెంలో ఈ సారి భారీ స్థాయిలో కోడిపందాలు జరుగుతాయని ప్రచారం జరిగింది. అన్నపూర్ణమ్మ పేరుతో లేఖ రావడంతో ఆమె సోదరుడు రామరాజు జువ్వలపాలెంలో ఈసారి పందాలు నిర్వహించే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు.

వినోదాలకు విడిదిగా భీమవరం

జిల్లాలో సంపన్న వర్గానికి కేంద్ర బిందువుగా మారిన భీమవరం వినోదాలకు విడిదిగా మారుతోంది. గత దశాబ్దకాలంగా ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖుల ఆహ్వానాలతో రాష్ట్రంలోని రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు సైతం భీమవరం తరలి రావడం పరిపాటిగా మారిం ది. హైదరాబాదు నగరంలో పలు రంగాల్లో స్థిరపడిన యువత రెండ్రోజుల క్రితం నుంచే భీమవరం చేరుకుంటున్నారు. భీమవరంలోని పేరొందిన హోటళ్లు, లాడ్జిలు, ప్రముఖుల అతిథి గృహాలు నెలరోజుల ముందే వీఐపీల కోసం సిద్ధం చేయడం కొసమెరుపు.

 
 పశ్చిమ గోదావరిలో...
ధాన్యాగారంగా పేరొందిన పచ్చని పశ్చిమ గోదావరి కోళ్ళపందేలాకు కేంద్రంగా మారింది. జిల్లాలో ఐ.భీమవరం ఈ కోళ్ల క్రీడకు వేదిక కానుంది. ఏటా జరిగే ఈ పందాలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి ప్రజాప్రతినిధులు, బడా బాబులు ఈ పోటీలకు హాజరవుతారు. ఒక్కో పందెం సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సాగుతుంది. కేవలం ఐ భీమవరంలోనే కాకుండా జిల్లాలో మరో పందెం బిరిని ( పందెం నిర్వహించే హద్దు) పోడూరుకు సైతం మార్పు చేశారు. 

 

జిల్లాలో నలుమూలలా ఇదే తీరు
 జిల్లాలోని ఐభీమవరం, పోడూరలతో పాటు జిల్లా నలుమూలల కూడా పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతాలైన గొల్లపాలెం, ఉండి, వీరవాసరం, వీరవాసరం, పెదపాడు, తాడేపల్లి గూడెంలో ఈ పందాలు నిర్వహిస్తారు. అదే విధంగా మెట్టప్రాంతంలోని లింగపాలెం, చింతలపూడి, టి.నర్సాపురం, విజయరాయి, పోలవరం వద్ద ఇటుకలకోట, బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే బిరులు సిద్ధం చేసుకున్నారు.


గూడెం నడిబొడ్డున బరి ! 
 
తాడేపల్లిగూడెం :
  సంక్రాంతి వచ్చేసింది. కోడిపందాలకు బరులు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది కొత్తగా సెలబ్రిటీలు పందాలు వీక్షించేందుకు గూడెం పట్టణానికి రానున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తుల ఆధ్వర్యంలో పట్టణ నడిబొడ్డులో జయలక్ష్మి థియేటర్ వెనుక స్థలంలో రెండు బరులు సిద్ధం చేశారు. అధికారికంగా పందాలకు ఇంకా అనుమతి రానప్పటికీ రెండు రోజులనుంచి ఇక్కడ ట్రైల్ పందాలు నిర్వహిస్తున్నారు. సినీరంగానికి చెందిన కొందరు వ్యక్తులను ఈ పందాలు వీక్షించేందుకు శనివారం పట్టణానికి తీసుకురానున్నట్టు తెలిసింది. మూడు రోజులపాటు సెలబ్రిటీలు పట్టణంలో బస చేసేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. విమానాశ్రయం సమీపంలో కూడా వేరొక బరిని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పందెగాళ్లు గురువారం పట్టణానికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

రాత్రీపగలు పందాల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేశారు. భోజన, మద్యం స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. పెంటపాడు మండలంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున పందాలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేశారు. మండలంలోని అలంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుని కనుసన్నలలో పెద్ద ఎత్తున పందాల నిర్వాహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇదే మండలంలో అత్తిలి మండలం సరిహద్దులో ఉన్న మీనవల్లూరు, తిరుపతిపురం గ్రామాల మధ్య మరో బరిని సిద్ధం చేస్తున్నారు.


మెట్ట ప్రాంతంలోనే 50కి పైగా బరులు

ఇటీవలికాలం వరకు జిల్లాలోని డెల్టా ప్రాంతానికే పరిమితమవుతున్న కోడి పందాలు క్రమేపీ మెట్టప్రాంతానికి విస్తరించాయి. ఈ ప్రాంతంలోని తోటలు, గుట్టలు జూదాల శిబిరాలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఫ్లడ్‌లైట్లు, జనరేటర్లు, మద్యం దుకాణాలు, హోటళ్లు తదితర ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. లింగపాలెం మండలం కొణిజర్లలో సిద్ధమవుతున్న బరిలో దాదాపు 200 కార్లు ఉంచేందుకు పార్కింగ్ స్థలంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే జూదరుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సినిమా సెట్టింగులను తలపించే టెంట్లు, రేయింబవళ్లు నిర్విరామంగా పందాలు సాగించేందుకు వీలుగా జనరేటర్, అడుగడుగునా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటయ్యాయి. చింతలపూడి మండలం వెంకటాద్రిపురంలోనూ ఇదే విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మండలంలోని రేచర్ల, నాయుడుగూడెం, చింతంపల్లి, ప్రగడవ రం, సీతానగరంలలోనూ బరి సిద్ధమైంది. పెదవేగి మండలం కొప్పాక, అంకన్నగూడెం, కొండలరావు పాలెం, కవ్వగుంట, వేగివాడ, రామసింగవరం, జీలుగుమిల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో పందాలరాయుళ్లు జూలు విదుల్చుతున్నారు. జిల్లా సరిహద్దులోని అప్పనవీడులో పేకాట, కోడిపందాల శిబిరానికి శుక్రవారం నిర్వాహకులు, పోలీసులకు మధ్య ఒప్పందం కుదిరింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామాల్లో కోడి పందాల శిబిరాలకు అనుసంధానంగా భారీగా పేకాటకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ రెండు చోట్లా రూ.10 కోట్ల మేర చేతులు మారే అవకాశం ఉంది. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు, బోసరాజుపల్లె, దేవరపల్లి మండలం గుడ్డిగూడెం, వాదాలకుంటతో పాటు ఏజెన్సీలోని పలుగ్రామాల్లో కోడిపందాలకు రంగం తయారైంది.

పేరుకు సంప్రదాయం... నడిచేది జూదం...

సంప్రదాయం పేరుతో కోడిపందాలకు పోలీసుల్ని ఒప్పిస్తున్న జూదాల రాయుళ్లు ఈ ముసుగులో పేకాట శిబిరాలను నిర్వహిస్తూ ప్రజల్ని కొల్లగొడుతున్నారు. ధర్మాజీగూడెం, కొప్పాక, కళ్లచెరువు, కొణిజర్ల, అప్పనవీడు తదితర ప్రాంతాల్లో కేవలం కోడిపందాలు నిర్వహించే విధంగా పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్న నిర్వాహకులు భారీస్థాయిలో కోసులు ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే పేకాటరాయుళ్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కార్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వారికి అవసరమైన మద్యం, బిర్యానీ, ఇతర తినుబండారాల స్టాళ్లు సిద్ధమయ్యాయి. పోలీసులు ఈ శిబిరాల వైపు కన్నెత్తి చూడకుండా కానిస్టేబుల్‌నుంచి అన్ని స్థాయిల్లోనూ ఎవరి వాటాలు వారికి అందజేసినట్లు సమాచారం. ఒక్కో శిబిరానికి రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లించే విధంగా బేరాలు కుదుర్చుకున్న నిర్వాహకులు, పండుగ ముగిశాక మరికొం త ముట్టజెప్పేందుకు హామీ ఇచ్చారని తెలిసింది. పోలీసుల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో శుక్రవారం నుంచి ఈ శిబిరాల ఏర్పాటు ఊపందుకుంది.





పూచీకత్తుపై కాలు దువ్వేందుకు..!
 అమలాపురం : పందెంలో గెలిచినా... గెలవకపోయినా పందెంరాయుళ్లు మాత్రం కోళ్లను మారాజుల్లా చూసుకుంటారనే దానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన పందెంకోళ్లను రూ. నాలుగు లక్షల పూచీకత్తుతో విడింపించారంటే వాటి విలువేంటో తెలుస్తుంది. పూచీకత్తుపై కత్తులు దూయించేందుకు కోడిపుంజులు దర్జాగా కటకటాల్లోంచి బయటకు వచ్చిన వైనమిది. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించే పందాలకు తరలిపోతున్న పందెం కోళ్లను ముమ్మిడివరం పోలీసులు నిఘా వేసి, తనిఖీలుచేసి మరీ పట్టుకున్నారు. మొత్తం 35 కోడిపుంజులను, రెండు క్వాలిస్ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి శుక్రవారం అమలాపురం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమయానికి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయకుండా తాత్సారం చేసి పరోక్షంగా పందెంరాయుళ్లకు సహకరించారనే విమర్శలున్నాయి. దీని వెనక అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులే సూత్రధారులు కావడం కొసమెరుపు. ఈ కేసుపై చార్జిషీటు అందకపోవడం, కోడిపుంజుల బాధ్యతను తాము తీసుకోలేమని పోలీసులు కోర్టుకు విన్నవించడం అంతా నాటకీయంగా జరిగిపోయాయి. దీంతో కోర్టు నిందితులు ఒక్కొక్కరినీ రూ. ఐదు వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. కోడిపుంజులను పండగ తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకుగాను రూ. నాలుగు లక్షలు పూచీకత్తుతో పందెంరాయుళ్లు విడిపించుకుపోయారు. చార్జిషీటు ఎప్పుడు పెడితే అప్పుడు కోళ్లను, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పక్కా షూరిటీ లభించడంతో కోళ్లు రెక్కలు విప్పుకుని ఎగిరిపోయాయి.


కోడి పందాలకు అనుమతి ఇచ్చిన వారిపై కోర్టు కెళ్తా 

సంక్రాంతి సందర్భంగా మొగల్తూరులో కోడిపందాలకు అనుమతి ఇచ్చిన వారిపై కోర్టులో కేసు వేస్తానని మొగల్తూరు సంస్థానానికి వారసుడు ఎస్‌ఆర్‌కేకే రామరాజబహుద్దూర్ (రాంబాబు) హెచ్చరించారు. తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూగజీవాల ప్రాణాలను పణంగా పెట్టి జూదమాడటం తగదన్నారు. గతంలో డింకీ పందా లు నిర్వహించేవారని, ప్రస్తుతం పుంజులకు కత్తులు కట్టి వాటి ప్రాణాలతో జూదం ఆడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కోడి పందాల కు అనుమతి ఇచ్చినవారిపై కోర్టుకు వెళ్లడమే కాకుం డా, జీవ కారు ణ్య సంఘానికి ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే లోకాయుక్తకు కూడా వెళతానని రాంబాబు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment