Friday, December 30, 2011

కోట్లాది రూపాయల కోడి పందేలు..

కోడి పందేలు...రాజుల కాలం నుంచి నేటి వరకు ప్రజలను అలరిస్తున్న ఓ వింత క్రీడ. నాటి కాలంలో కోడి పందేల మూలంగా వివిధ రాజ్యాల మధ్య పెద్ద యుద్దాలే జరిగాయి. ఈ యుద్ధాలలో అధిక సంఖ్యలో ప్రజలు హతమయ్యారు. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో నాటి నుంచి నేటివరకు ఈ పందేలకు ప్రజల్లో విపరీతమైన జ్‌ ఉంది. కాలం మారినా ప్రజల్లో కోడి పందేల పట్ల ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.ఈ పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగడం నేటి ట్రెండ్‌. సంక్రాంతి పండుగ రోజున ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగుతుంటాయి.ఆధునికులకు అర్థం కావాలంటే ఈ బెట్టింగ్‌లు క్రికెట్‌ బెట్టింగ్‌ల లాంటి వన్నమాట.

pandem1 
సంక్రాంతి పండుగకు తూర్పు గోదావరి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా ఇక్కడ సంక్రాంతి వేడుకలను నిర్వహిం చడంతో పాటు ప్రత్యేకంగా కోడి పందేలను నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా కోడి పందేలను జోరుగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత.జిల్లాలో కోడి పందేలు ఆట వినోదంగా మారింది.ఎన్నో ఏళ్లు నుండి పోలీసులు ఈ రాక్షస క్రీడను అరిడతామని బీరాలు పలికినా రాజకీయ పలుకుబడితో కోడి పందేలు కొనసాగుతుండడంతో పోలీసులు తోక ముడుస్తున్నారు. ప్రతి ఏడాది కోడి పందేల మీద బెట్టింగ్‌లను అరికడతామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప వాస్తవంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా సామాన్య ప్రజలు సైతం ఈ పందేలపై వేలాదిరూపాయలను పెడుతున్నారు. ఫలితంగా సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్లాది రూపాయల డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.

కోడి పందేల చాటున జూదం...

తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ మూడు రోజులు కోడి పందేలు జాతర రసవత్తరంగా సాగుతుంది. కోడిపందేలు మాటున గుండాట, పేకాట, ‘లోపల బయట’ అనే జూదం యదేచ్ఛగా సాగుతాయి. కోడిపందేల చాటున గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ జూద కార్యక్రమాలు కొందరికి రెండు,మూడు రోజుల్లోనే లక్షలాది రూపాయలను ఆర్జించి పెడుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు నిర్వహించేందుకు ఇప్పటికే పుంజులను సిద్ధం చేశారు. ఒక్కొక్క పుంజు రూ. 10వేలు నుండి 25వేలు వరకు కొనుగోలు చేస్తున్నారు. డెల్టాలో సంక్రాంతికి ప్రత్యేకంగా కోడిపుంజులను మేపుతారు.

pandem2 
ఈ మూడు రోజులు యువత నుండి వృద్ధుల వరకు పందేలను చూసేందుకు ఎగబడతారు. ఈ పందేలలో డబ్బులు గెలిచిన వారు సంక్రాంతి జోష్‌గా వేడుకలు చేసుకుంటే ఓడినవారు అప్పు చేసి మద్యం త్రాగి ఇంట్లో జోగుతారు. గుంటూరు నుండి కోడిపందేలు ఇప్పటికే భీమవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి.పౌరుషానికి పెట్టింది పేరైన పల్నాటి కోడి పందేలకు మంచి గిరాకి ఉంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ పందేలను తిలకిస్తుంటారు. పండుగ రోజుల్లో కోడి పందేలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఇక పందేల కోసం కోడి పెట్టతో క్రాసింగ్‌ చేయించి పుంజులను ప్రత్యేకంగా ఉత్పత్తి చేశారు.

కోట్లల్లో పందేలు...
డెల్టాలో ప్రతి గ్రామంలో కోడి పందేలకు ఒక ప్రత్యేకమైన బరిని ఏర్పాటు చేస్తారు. సంక్రాంతి మూడురోజుల్లో ఈ బరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. నేలను చదునుచేసి, చుట్టు తాళ్ళాతో ప్రహారీని ఏర్పాటు చేస్తారు. ముందుగా బరికి నైవేధ్యంగా నల్లకోడిని బలిస్తారు. గ్రామంలో రూ.25వేలు నుండి లక్ష వరకు పందేలు సాగుతాయి. ఆకివీడు మండలం ఐ భీమవరం, ప్రకృతి ఆశ్రమం దగ్గరలోని తోటలో, చించినాడ సమీపంలో, జువ్వలపాలెం, తదతర ప్రత్యేక బరులల్లో కోట్లాది రూపాయాల పందాలు జరుగుతాయి.పందాల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పందేలను తిలకించేందుకు వచ్చే వారి కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పండుగ రోజుల్లో విందువినోదాల్లో మునిగితేలేందుకు అవసరమైన సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తున్నారు.

పందెం కోడికి ప్రత్యేకాహారం...

బరిలో దిగే పందెం కోడికి ప్రత్యేకాహారాన్ని అందిస్తారు. గుడ్లు, గంట్లు,చోళ్ళు, కైమా, బాదం పిక్కలు, తొండమాంసం వేస్తారు. దీంతో పందెం కోడి బలంగా తయారవుతుంది. వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌, ఇతర మందులు కూడా వాడతారు. పందెంలో కోడికి గాయమైతే రక్తం వెంటనే బయటకు రాకుండా ఈ ఆహారాన్ని వాడతారు. పందెం కోడికి ప్రత్యేకమైన శిక్షణ కూడా శిక్షణ కూడా ఇస్తారు. ఇక పందేలలో కోళ్లకు కత్తులు కట్టి వాటిని పోట్లాటకు దించుతారు. కత్తులు గాయాలతో రక్తాలు కారుతున్నా అవి ఏమాత్రం వెనుకంజ వేయకుండా పోరాడడం సందర్శకులను చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఈ విధంగా పందెం కోళ్లకు శిక్షణనిస్తారు. చివరికి ఈ పందేలలో కొన్ని కోళ్లు కూడా మృతిచెందుతాయి.ప్రజలకు వినోదాన్ని పంచి చివరికి తమ జీవితాలను ముగిస్తాయి.

కొన్ని జీవితాలకు ఆధారం...
pandem 
కోడి పందాలను ఆధారంగా చేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో ఉన్న పెద్దలు కుక్కుట శాస్త్రాన్ని ఎక్కువగా చదువుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వృత్తిని ఎంచుకుని కోడి పుంజులను పెంచుతారు. మాములు రోజుల్లో పుంజు ధరరూ.3వేలు నుండి 10వేలుకు అమ్ముతారు. ఇవే పుంజుల ధరలు సంక్రాంతి సీజన్‌లో ఆకాశానికి తాకుతాయి. పందెం కోడికి కత్తి కట్టేవారు ఈ పందేళ్ళపైన ఆధారపడి జీవిస్తారు.

పుంజుల్లో రకాలు...
కోడి పుంజుల్లో అనేక రకాల జాతులన్నాయి. అయితే ప్రధానంగా 17రకాల జాతులను మేలు జాతులుగా పందెం కోళ్లుగా పరిగణిస్తారు. డేగా, నెమలి, నల్ల నెమలి, కేతువ, నేతువ, పర్ల, పెట్టమారు, మైలా, రసంగి, కోక్కిరాయి. కాకి, పచ్చకాకి, తెల్లపర్ల, కౌజు, సరళ ఇటువంటి రకాలను మేలైన జాతి పుంజులుగా పరిగణించి పెంచుతారు. ఈ పందెం కోళ్ళల్లో నెమలి,కాకి, డేగ జాతులే నెంబర్‌ వన్‌ కోళ్ళుగా పెర్కొంటారు.

బారుతీరుతున్న జనం...
సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఇంటి అల్లుళ్ళులతో పాటు బంధువులు సైతం కోడి పందేలను చూసేందుకు వెళ్తారు. సుదూర ప్రాంతాల నుండి పందేలను చూడాడానికి తరలి వస్తారు. హైదరాబాద్‌, విశాఖ నగరాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు పందాలు కోసం ప్రత్యేకగా వస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, వ్యాపారరంగాల్లో స్థిరపడిన జిల్లావాసులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేకంగా కోడి పందేలను చూడడానికి రావడం గమనార్హం. భీమవరం ప్రకృతి ఆశ్రమం దగ్గరలో ఉన్న బరిలో జరిగే కోడి పందేలకు సినీతారలను ప్రత్యేక ఆకర్షణగా తీసుకు వస్తారు.

- కె.శ్రీనివాస్‌, భీమవరం